సీరియ‌స్ చెస్ ప్లేయ‌ర్ల ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతున్న chess24.com బాంట‌ర్ బ్లిట్జ్‌

చెస్‌24 డాట్ కామ్ (chess24.com) లో క‌నిపించే విశిష్ట‌మైన ఫీచ‌ర్ బాంట‌ర్ బ్లిట్జ్‌. బాంట‌ర్ అంటే స‌రదాగా జరిపే సంభాష‌ణ అని అర్థం. ఇందులో చెస్‌24 డాట్ కామ్‌కు చెందిన స్ట్రాంగ్ ప్లేయ‌ర్‌, ఆ డాట్ కామ్‌కు చెందిన ప్రీమియం స‌భ్యుల‌తో రెండు, రెండున్న‌ర గంట‌ల‌పాటు నిర్విరామంగా బ్లిట్జ్ గేమ్స్ ఆడ‌తాడు. అది కూడా మాట్లాడుతూ ఆడ‌తాడు. మాట‌లంటే అవి ఏవో పొద్దుపోయే మాట‌లు కాదు. తాను వేసే ఎత్తుల గురించి, ప్ర‌త్య‌ర్థి వేసే ఎత్తులు, వ్యూహాల వెన‌క మ‌ర్మం గురించి మాట్లాడుతూనే వుంటాడు. సీక్రెట్స్ దాచేసి ఏవో పైపైన మాట్లాడ‌తారనే అపోహ కూడా వ‌ద్దు. ఒక రకంగా ఇది మంచి చెస్ ఎడ్యుకేష‌న్‌. ట్రెయినింగులాగే వుంటుంది. అయితే బ్లిట్జ్ విష‌యంలో బ్యాలెన్స్‌గా వుండాల్సి వుంటుంది. అది క్లాసిక్ ఆట మీద ప్ర‌భావం చూప‌కుండా చూసుకోవాలి. బ్లిట్జ్ గేమ్స్‌ను ఓప‌నింగ్ ప్రాక్టీస్ కోసం, స్పీడ్ థింకింగ్‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని బాగా పేరున్న‌వారు అంటున్నారు. I think one of the main advantages with blitz is you get to see a lot more games per hour and will learn much from them relating to some crucial aspects of chess అని సూప‌ర్ జిఎం అనీష్ గిరి అంటారు.

చెస్ 24 డాట్‌కామ్ లో ప్రీమియ స‌భ్య‌త్వం నెల‌కు రూ.700వ‌ర‌కు వుంటుంది. ప్రీమియం స‌భ్య‌త్వం వున్న‌వాళ్లకు మాత్ర‌మే బాంట‌ర్ బ్లిట్జ్ ఆడే అవ‌కాశం ఇస్తారు. అంతే కాదు అనేక విలువైన వీడియోల‌ను చూడ‌వ‌చ్చు. బాంట‌ర్ బ్లిట్జ్‌లో జాయిన్ అయ్యేవారంద‌రికీ స్ట్రాంగ్ ప్లేయ‌ర్‌తో ఆడే అవ‌కాశం రాదు. జాయిన‌యిన‌వారిలో చాలా మంది ప్రేక్ష‌కులుగానే మిగిలిపోతారు. అయితే ఎక్కువ‌గా బాంట‌ర్ బ్లిట్జ్ సెష‌న్స్ వుంటాయి కాబ‌ట్టి ఎప్పుడో ఒక‌సారి మ‌న‌కు అవ‌కాశం వ‌స్తుంది. చెస్ 24 డాట్‌కామ్ వారి స్ట్రాంగ్ ప్లేయ‌ర్ త‌న ఆలోచ‌న‌ల్నిబ‌ట్టి త‌న ప్ర‌త్యర్థుల‌ను రాండ‌మ్‌గా ఎంపిక చేసుకుంటూ పోతాడు. ఎంపిక చేసుకోవ‌డం ఆ వెంట‌నే, ఆ ప్ర‌త్య‌ర్థితో ఆడుతూ విశ్లేష‌ణ చేస్తూ ఆట‌ను ముగిస్తాడు. 95 శాతం మంది ఆ స్ట్రాంగ్ ప్లేయ‌ర్ చేతిలో ఓడిపోతుంటారు.

బాంట‌ర్ బ్లిట్జ్ ఆడే అవ‌కాశం రాక‌పోయినా స‌రే బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఆ మూడు గంట‌ల సేపు చ‌క‌చ‌కా సాగే అనేక గేముల‌ను చూస్తూ, వారి కామెంట‌రీ విన‌డమంటే అది మంచి చెస్ ఎడ్యుకేష‌నే. దాదాపు కోచింగులాగే వుంటుంది. అందులో పీట‌ర్ స్విడ్ల‌ర్ లాంటి గ్రాండ్ మాస్ట‌ర్ల బాంట‌ర్ బ్లిట్జ్, టాకింగ్‌ మ‌రింత గొప్ప‌గా వుంటుంది. అలా అని ఇత‌రులు కూడా త‌క్కువేమీ కాదు. బాంట‌ర్ బ్లిట్జ్ నిర్వ‌హించే స్ట్రాంగ్ ప్లేయ‌ర్‌తో ఆడ‌డానికి మ‌ధ్య మ‌ధ్య‌లో ప్రసిద్ధి చెందిన ఆట‌గాళ్లు కూడా వ‌స్తుంటారు (వ‌ర‌ల్డ్ టాప్ 20లోని వారు కూడా వస్తున్నారు. ఆ విష‌యాన్ని బాంట‌ర్ బ్లిట్జ్ ఆడే మెయిన్ ప్లేయ‌ర్ ఆ సెష‌న్లో తెలియ‌జేస్తాడు). అలాంట‌ప్పుడు ఆట చూడ‌డానికి మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా వుంటుంది. మ‌రో విష‌యం చెస్ 24 డాట్ కామ్‌లో బాంట‌ర్ బ్లిట్జ్ నోటిఫికేష‌న్లు నిత్యం వ‌స్తూనే వుంటాయి. ఇందులో ట్రెయినింగ్ ట్యూష్‌డే అనే ఫీచ‌ర్‌కూడా వుంది. ఇది కూడా ప్రీమియం స‌భ్యుల‌కే. ఇంగ్లీషు భాష విష‌యంలో కొంత స‌మ‌స్య వ‌స్తుంది. అయితే సీరియ‌స్ చెస్ ప్లేయ‌ర్ల‌కు ఇది పెద్ద స‌మ‌స్య కాదు. 80 శాతం ఐడియాలు, సూచ‌న‌లు, స‌ల‌హాలు.. నొటేష‌న్‌ను చూడ‌గానే అర్థ‌మైపోతాయి. రెండు మూడు సెష‌న్లు అయిపోగానే ఆ ఇంగ్లీషు కూడా అల‌వోక‌గా అల‌వాటైపోతుంది. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

https://youtu.be/mIFJ7MsUxts?t=3284 ( ఈ లింకులో చెస్ 24 డాట్ కామ్ ఈ మ‌ధ్య‌నే నిర్వ‌హించిన కింగ్ క్ర‌ష‌ర్‌ బాంట‌ర్ బ్లిట్జ్ వీడియోను చూడ‌వ‌చ్చు.)

ఇక్క‌డ కింగ్ క్ర‌ష‌ర్ గురించి నాలుగు మాట‌లు. ఆయ‌న 2121 ఫిడే రేటింగు క‌లిగిన క్యాండిడేట్ మాస్ట‌ర్ . పైన బ్రాకెట్లో వున్న రేటింగు ఆయ‌న చెస్ 24 డాట్ కామ్ రేటింగ్‌. కింగ్ క్ర‌ష‌ర్ బ్రిట‌న్లో చెప్పుకోద‌గ్గ స్థాయిలో పేరున్న‌ ఆట‌గాడు. అస‌లు పేరు ట్రైఫ‌ర్ గావ్రియ‌ల్‌. ఆయ‌న అత్య‌ధిక ఫిడే ఎలో 2250. ఆయ‌న‌తో ఆడి గెలిచిన శిబి ఐనీస్టీన్ ఫిడే రేటింగు 1763.

ప‌లు ప్ర‌ముఖ చెస్ వెబ్‌సైట్లు అతి త‌క్కువ ఫీజుతోనే నాణ్య‌మైన సేవ‌లు అందిస్తున్నాయి. ఈ విష‌యం తెలియ‌జేయ‌డానికే బాంట‌ర్ బ్లిట్జ్ ఉదాహ‌ర‌ణ‌గా చూపుతూ ఈ పోస్టు పెడుతున్నాను. ప్రీమియం మెంబ‌ర్ షిప్ తీసుకోవాల‌నే బ‌ల‌వంతం ఏమీ వుండ‌దు. పేరురిజిస్ట‌ర్ చేసుకున్న వారికి కూడా ఆయా వెబ్‌సైట్లు అందించే ఉచిత సేవ‌లు త‌క్కువేమీ కాదు. మంచి మంచి విశ్లేష‌ణ‌లతోపాటు ప‌లు టైమ్ కంట్రోల్ గ‌ల గేముల‌ను ఉచితంగానే ఆడుకోవ‌చ్చు. ప్రీమియం మెంబ‌ర్ల‌కు మ‌రిన్ని అద‌న‌పు సేవ‌లు వుంటాయి. చెస్ 24 డాట్ కామ్‌, చెస్ డాట్ కామ్‌, చెస్ బేస్ ఇండియా (ప్లే చెస్ డాట్‌కామ్‌), లీ చెస్‌, ఐసిసి డాట్ కామ్ లాంటివి నిత్యం అనేక అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న ఆట‌గాళ్ల ఆద‌ర‌ణ పొందుతున్నాయి. మ‌న‌కు సంబంధించిన మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగూ చ‌ద‌రంగాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోవడం లేదు క‌నుక అస‌లు సిస‌లు, నాణ్య‌మైన వార్త‌లు, ఫీచ‌ర్ల కోసం ప్ర‌సిద్ధి చెందిన‌ చెస్ వెబ్‌సైట్ల‌పైన ఆధార‌ప‌డ‌డం త‌ప్పితే మ‌రో ప్ర‌త్యామ్నాయం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు chessbase.com, chessbase.in ల‌లో విశ్లేష‌ణ‌లు అసాధార‌ణంగా వుంటున్నాయి. చెస్ బేస్ ఇండియాలో ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్‌ సాగ‌ర్‌షా విశిష్ట‌మైన విశ్లేష‌ణ‌లు చేస్తూ బ‌డ్డింగ్ ప్లేయ‌ర్లలో గేమ్ ప‌ట్ల అవ‌గాహ‌న‌ను గ‌ణ‌నీయంగా పెంచుతున్నారు.