ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు – 2017

తెలుగు భాషా వికాసాలకు పుట్టినిల్లు తెలంగాణ. తెలంగాణ అంటే తెలుగు ప్రజలు నివసించే ప్రదేశం అని అర్థం. రెండున్నరవేల వసంతాల తెలుగు వెన్నల సోన మన తెలంగాణ. అలనాటి హాలుని గాథా సప్తశతిలో అల్లనల్లన అల్లుకున్న తెలుగు పదదీప్తి కాలగమనంలో దశ దిశల ప్రసరించింది. ఈ పదరూపాలు చారిత్రిక జీవనాన్ని అక్షరబద్ధం చేసిన శాసనాలైనాయి. అందమైన అలంకారాలు ధరించి హృద్యమైన పద్య కావ్యాలైనాయి. తెలంగాణ అన్ని సాహిత్య ప్రక్రియలకు ఆదిగా నిలిచింది. తొలి అలంకార గ్రంథాన్ని సంతరించింది. ఎలుగెత్తి పాడుకునే ద్విపదనందించింది. తెలుగు స్వతంత్ర కావ్యం, శతకం, ద్విపద రామాయణం, అచ్చ తెలుగు కావ్యం, యక్ష గానం, సాంఘిక చరిత్రం అన్నిటికీ తొలిరూపు దిద్దింది. ఆధునిక ప్రక్రియలైన వచనకవిత, కథ, నవల అన్నిటిలో తనదైన జీవనాన్ని చిత్రించింది. కొలమానాలకందని సాహిత్య సంపదతో కొలువుదీరింది. తెలుగు సాంస్కృతిక వికాసంలో తెలంగాణ జాతి ఖ్యాతిని ప్రపంచానికి విదితం చేయాలనే సంకల్పంతో ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సాహిత్య అకాడమి నిర్వహణలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది.

ప్రపంచ తెలుగు మహాసభల ఆశయాలు

  • ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలంగాణ జాతి ఖ్యాతి ప్రపంచానికి విదితమౌతుంది.
  • తెలుగు భాషాభివృద్ధిలో తెలంగాణ సాహిత్యమూర్తుల కృషికి తగిన గౌరవం లభిస్తుంది. వారి మహత్తర సేవలను ఈ సభలు ప్రపంచానికి చాటుతాయి.
  • తెలంగాణ కళా వైభవం సభలలో సాక్షాత్కరిస్తుంది.
  • వివిధ దేశాలలో, వివిధ రాష్ట్రాలలో  స్థిర పడిన తెలుగు భాషాభిమానులందరి మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొంటాయి.
  • ప్రత్యేక ప్రచురణలు తెలంగాణ దృక్పథంతో నూతన అధ్యయనానికి తెరతీస్తాయి.
  • సదస్సులు నూతన రీతులకు నాంది పలుకుతాయి.
  • ఆధునిక సమాజ అవసరాలకు అనుగుణంగా తెలుగును అభివృద్ధి చేయడానికి సభలు మార్గ దర్శనం చేస్తాయి.  అన్ని రంగాలలో వ్యవహారాలు తెలుగులో జరిగేందుకు బాటలు పడుతాయి.
  • కొత్త తరానికి సాహిత్య స్ఫూర్తిని అందిస్తాయి.
  • తెలంగాణ ప్రజలలో సాహిత్య సాంస్కృతిక ఉత్తేజం వెల్లి విరుస్తుంది.

ప్రపంచ తెలుగు మహాసభల వేదికలు :
ఎల్. బి. స్టేడియం, రవీంద్ర భారతి, లలిత కళా తోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం మరియు ఎన్.టి.ఆర్. ఆడిటోరియం.

తేధిలు  :
2017 డిసెంబర్ 15 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు

మ‌రిన్ని వివ‌రాల‌కు కింది వెబ్‌సైట్‌ను చూడ‌గ‌ల‌రు.   http://wtc.telangana.gov.in/

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *