ఓపెన్ సోర్స్‌ను ఉప‌యోగించే ప్ర‌య‌త్నం చేయండి…

సాప్ట్‌వేర్‌ కొనడానికి ఎంత డబ్బయినా వృధా చేస్తాం గానీ ఎవరన్నా ఉచితంగా ఇస్తున్నాం, డ‌బ్బులు పెట్టి కొన‌డం ఎందుకు ఈ సాఫ్ట్‌వేర్ వాడి చూడండి .. పెయిడ్ క‌న్నా చ‌క్క‌గా ప‌ని చేస్తుందంటే మనం నమ్మం. పెయిడ్ సాప్ట్‌వేర్స్ కొనలేక‌పోతే .. వాటిని పైర‌సీ చేసి అయినా కూడా వాటినే ఉప‌యోగిస్తాం. ఓపెన్ సోర్స్ లేదా ఉచిత సాఫ్ట్‌వేర్స్‌లో అనేక సాఫ్ట్‌వేర్ ఎంతో బాగా ప‌నిచేస్తున్నాయి. సెల్‌ఫోన్‌ గానీండి, కంప్యూటర్‌ గానీండి, మరోక‌టి గానీండి, ఏదైనా సరే అంతా ఆరునెల్లే. ప్రతిరోజు కొత్త పరిజ్ఞానం మార్కెట్‌లోకి వస్తుంది. ఇది సాఫ్ట్‌వేర్‌కు మినహాయింపేమీ కాదు. వేలకు వేలు పోసి ఒక సాఫ్ట్‌వేర్‌ కొంటే, దానికి మరో వెర్షన్‌ ఆరు నెలల్లో ప్రత్యక్షం.మనం కొత్త సాఫ్ట్‌వేర్‌ వాడకపోతే, వెన‌క‌ప‌డి పోయిన‌ట్టే. దీని వల్ల హెచ్చు శాతం ప్రజలు పైరసీకి దోహదపడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ను కాపీ చేసి వాడటం తప్పే కాదు, నేరం కూడా! మరి దీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. అదే ”ఓపెన్‌సోర్స్‌”.
ఓపెన్ సోర్స్ .. ఒక‌సారి ఉప‌యోగించే చూడండి…
ఓపెన్‌ సోర్స్‌ అంటే అంతా బహిరంగంగానే లభించడం అదీ ఉచితంగా! దానికి సోర్స్‌ కోడ్‌ కూడా లభిస్తుంది. కేవలం మనం ఒక సాఫ్ట్‌వేర్‌ను వాడటమే కాక, కావలిస్తే దానికి మరిన్ని ఫీచర్లు జోడించడమో ఉన్న సమస్యను పరిష్కరించడమో చేసి దానిని తిరిగి అందరికీ అందుబాటులో తేగలగడం ప్రత్యేకత. అంతా ఓపెన్‌. వాణిజ్య పరంగా లభించే ఆఫీస్ సూట్‌లు నుంచీ ఇమేజ్ ఎడిటింగ్‌, ప్రజంటేషన్‌ సాఫ్ట్‌వేర్‌లే కాదు, ఆప‌రేటింగ్ సిస్టమ్‌లు, డేటాబేస్ సిస్టమ్‌లూ.. ఇలా ఏ రకమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకున్నా దానికి ఓపెన్‌ సోర్స్‌లో ప్రత్యమ్నాయం ఉంది.
ఓపెన్‌ స్టోర్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడుకోవడానికి ఎలాంటి ఆటంకాలూ, పరిమితులూ, పర్మిషన్లూ అక్కర్లేదు. 1983లో రిచర్డ్స్‌ మాథ్యూస్‌ స్టాల్‌మాన్‌ ఆరంభించిన ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ స్ఫూర్తితో 1998లో ఓపెన్‌ సోర్స్‌ ఉద్యమరీతిలో వెలుగులోకి వచ్చింది. 1999లో ‘స్టార్‌ ఆఫీస్‌’ పేరుతో అమ్మకాలు సాగించిన సన్‌మైక్రో సంస్థ దానిని ఉచితంగా ఓపెన్‌ సోర్స్‌ కింద ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తేవడంతో ఊపందుకొంది. స్పెయిన్ లాంటి దేశాల్లో ఓపెన్‌ సోర్స్‌, ఫ్రీ సాప్ట్‌వేర్‌ల ఆధారంగా శిక్షణనివ్వడమే కాదు, ఆయా సాఫ్ట్‌వేర్‌లను ఇ గవర్నెస్‌లో వాడుతున్నారు. భారతదేశంలో ఇట‌వ‌ల కాలంలో ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ వినియోగం బాగా పెర‌గింది. ప‌లు ప్ర‌భుత్వ‌, ప్రవేట్ సంస్థ‌లు కూడా పెయిడ్ సాఫ్ట్‌వేర్స్‌ను కొనే ఉద్దేశ్యం లేక ఉచిత సాఫ్ట్‌వేర్స్‌నే ఉప‌యోగిస్తున్నాయి. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ను వాడటం మొదలైంది.
ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌పై అపోహలు …
ఓపెన్‌ సోర్స్‌ గురించి చాలా మందికి అనేక అపోహలున్నాయి. అతి ముఖ్యంగా అందరికి కలిగే కొన్ని సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని కంటే ముందు ఓపెన్‌సోర్స్‌ను ఎలా విస్తరిస్తుందో కూడా తెలుసుకుందాం.
పేరొందిన లినక్స్‌ డిస్ట్రిబ్యూషన్స్‌…
లినక్స్‌ ఆపరిేంగ్‌ సిస్టమ్‌ అనేది ఓపెన్‌ సోర్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆప‌రేటింగ్ సిస్టమ్‌. ప్రపంచవ్యాప్తంగా పలువురు డెవలపర్లు, సంస్థలూ సోర్స్‌కోడ్‌తో సహా అందరికీ ఇంట‌ర్నెట్‌లో ఉచితంగా లభించేలా చూస్తుండటం, సమస్యలకు పరిష్కారం చిటికెలో ఇవ్వడం వల్ల ప్రజాదరణ పొందింది ‘లినక్స్‌’. లినక్స్‌కు తమ వంతుగా మరిన్ని యుటిలీటిలు,ప్యాకేజిలూ జోడించి అందరికీ అందిస్తున్నాయి కొన్ని సంస్థలు. వీటిలో Debian అనేది అత్యంత పురాతనమైన డిస్ట్రిబూషన్‌. దీని గురించి http://www.debian.org/ లో మరిన్ని వివరాలు పొందవచ్చు. డెబియన్‌ తర్వాత అంత ప్రసిద్ధి పొందింది Red hat. నేడు అత్యధికులు దీన్నే వాడుతున్నారు. సంస్థపరంగా చక్కని సపోర్టు దీని ప్లస్ పాయింట్‌. అయితే ఇటీవ‌ల‌ ‘ఉచితంగా’ అన్నీ ఇవ్వకుండా రెడ్ హ్యాట్‌ లినక్స్‌ కమర్షియల్‌గా వస్తోంది. మరిన్ని వివరాలు http://www.redhat.com లో చూడవచ్చు. మాండ్రేక్ (Mandrake) అనేది కూడా రెడ్‌హ్యాట్ తర్వాత అంత పాపులర్‌. http://www.mandra kesoft.com లో మరిన్ని వివరాలు చూడొచ్చు. జర్మనీలో రూపొందించిన లినక్స్‌ వెర్షన్‌ ఒకటుంది దీనిపేరు SuSe.. దీనిలో ఉండే Yast (Yet another software tool) అనేది ఎలాంటి సాప్ట్‌వేర్‌నైనా ఈజీగా ఇన్‌స్టాల్‌ చేస్తుంది. ఇప్పుడు ‘ఉబుంటూ’ అనేది చాలా పాపులర్‌. ఉబంటూను ఎంతో సులభశైలితో వాడటం, నిర్వహించడం వల్ల ఎందరెందరో దీనిని వాడుతున్నారు. wikimedia ఎంతో సమర్థవంతంగా దీన్ని వాడుకుంటుంది. ఫ్రాన్స్‌ దేశాలలో జాతీయ పోలీస్‌ శాఖ తన కొన్ని వేల పీసీలలో ఉచితంగా ల‌బించే ఉబంటూనే ఇన్‌స్టాల్‌ చేసింది.
జర్మనీలో వెబ్‌హోస్టింగ్‌ సర్వీస్‌ అయిన Plus Server తన ఇంటర్నల్‌ సిస్టమ్‌లలో 70% సిస్టమ్‌లలో ఉబుంటూనే వాడుతోంది. తన కస్టమర్ల హోస్టింగ్‌లో 15% ఇప్పటికే ఉబంటూ మీదే రన్‌ అవుతోంది. చికాగోకు చెందిన Contest Media సంస్థ మొత్తంగా తమ వెయింటిగ్‌ రూమ్‌
పీసీ నెట్‌వర్క్‌నంత‌టినీ ఉబంటూ మీదే నడుపుతోంది. అండలూసియన్‌ ప్రాంతీయ పభ్రుత్వం, స్పెయిన్‌లోని ఆండలూసియాలోని 2వేల స్కూల్స్‌లో ఉబంటూ ద్వారా నెట్‌వ‌ర్కింగ్‌ చేయమని నిర్ణయాలను జారీ చేసింది. ఇసోటోలో సంస్థ 2,20,000 ఉబుంటూ ఆధారిత వర్క్‌ స్టేషన్స్‌ను 2వేల స్కూల్స్‌లో అమలు చేసింది కూడా! అలాగే, ఎంఫనీ టెక్నాలజీస్‌ అనే మరో సంస్థ తన ఐటీ ఇన్‌ఫాస్ట్రక్చర్‌లో ఉబుంటూను జోడించింది. నూటికి నూరు శాతం అప్‌టైమ్‌ను సాధించింది. దీనికోసం ఉబుంటూ సర్వర్‌ ఎడిషన్‌ను ఎంచుకొందా సంస్థ. దాదాపు ఆరేళ్ళ క్రితం ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చిందీ సంగతి.! ప్రతి ఆరు నెలలకీ లేదంటే ఏడాదికే ఓ కొత్త మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ లేదా ఆఫీస్‌ సాఫ్ట్‌వేర్‌ వెర్షన్‌ మార్కెట్‌లోకి వస్తోంది. దానికి తోడు కొత్త ప్రొసెసర్లు, కొత్త పీసీలు ఈ అప్‌డేషన్స్‌ చేసుకోవడంతోనే సగం జీవితం గడిచిపోతోంది. పైగా పూర్తిగా ఖర్చుతో కూడుకున్న పని కూడా! వీటన్నింనీ అధిగమించామనుకొంటుండగానే, మరో కొత్త వైరస్‌ తాకిడి. ఆ తలనొప్పిని తగ్గించాలంటే ముందుగా ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వ‌ర్ కొనాలి. ఇవన్నీ చూశాక ‘అసలు కంప్యూటర్‌ ఎందుకు కొన్నాంరా బాబూ!’ అనిపిస్తుంది. వ్యక్తిగతంగానే కాదు సంస్థల పరంగా కూడా ఇదే పరిస్థితి.
ఈ ప్రశ్నను తనకు తానే వేసుకొన్న మేధావికి హఠాత్తుగా అసలు విండోస్‌ నుండి తానెందుకు లినక్స్‌కు మారకూడదని అనిపిస్తుంది. ఒక్క రోజులో లినక్స్‌కు మారిపోయాడు. కేవలం ఒక వారంలోనే అతనికి ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. ఇన్నాళ్లు మనకు దీని గురించి తెలియనేలేదే అని బాధపడ్డాడు. ఎందుకంటే రోజు వచ్చే వైరస్‌ తాకిడి లేదు. వాటి వల్ల వచ్చే సమస్యలు అసలే లేవు, సిస్టం హంగ్‌ అవడం మానేసింది. ఈ కారణంగా రీబూట్ అయ్యే విండోస్‌ దాని ఉత్పత్తులనుండి విముక్తిని పొందాంరా బాబూ! అనిపించింది. ఎం.ఎస్‌.ఆఫీస్‌ లేదే
ఏం చేయాలి అనుకొంటుండగా, దీటైన ఓపెన్‌ ఆఫీస్‌ కనించింది. ఇన్‌స్టాల్‌ చేసుకొన్నాడు. గతంలో రూపొందించిన డాక్యుమెంట్ ఫైల్స్‌ని నేరుగా ఓపెన్‌ చేసుకోగలగడం మరింత సంతోషాన్నిచ్చింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు బదులు మోజిల్లా ఫైర్‌ ఫాక్స్‌ని, అవుట్ లుక్‌ ఎక్స్‌ప్రెస్‌కు బదులు మొజిల్లా మెయిల్‌ ఇలా అన్నింటికీ లినక్స్‌లో ప్రత్యమ్నాయాలు దొరుకుతాయి. ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్‌కు వైర‌స్‌లు, స్పామ్‌ల తాకిడి అంత‌గా ఉండ‌దు. పెయిడ్ సాప్ట్‌వేర్స్‌తో పోలిస్తే ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ చాలా శ‌క్తివంత‌మైన‌వ‌నే చెప్పాలి. ఓపెన్‌సోర్స్‌లో ప్ర‌తి అవ‌స‌రానికి అనేక సాఫ్ట్‌వేర్స్ వాడుక‌లో ఉన్నాయి.
ఒక రెండేళ్ళు గడిచేసరికి అతనికి ఆర్థికంగా ఎంత లాభపడ్డానా అని బేరీజు వేసుకున్నాడు. అంతే మళ్లీ ఒక ల్యాప్‌టాప్ కొన్నాడు (విండోస్‌, ఆఫీస్‌ సాప్ట్‌వేర్‌లను కొనక పోవడం వలన బోలెడు డబ్బులు ఆదా అయ్యాయి కదా మరీ!) దానిలోనూ లినక్స్‌ బాటే! నాకు ఈ ఖర్చు, వెర్షన్‌ గొడవలే కాదు, వైరస్‌ గొడవే తప్పడంతో చాలా రిలీఫ్‌గా ఉంది అంటూ తెగ సంబరపడి పోయాడు. ముందుగా ఓపెన్‌సోర్స్‌ అంటే మనలో కలిగే అపోహలను తొలగించాలి. ఒక‌సారి ఓపెన్‌సోర్స్‌ను వాడి చూస్తే చాలా వ‌ర‌కు మ‌న‌కు వాటి మీద ఉన్న అపోహ‌లు తొల‌గిపోతాయి. ముందుగా వాడి చూద్దాం అని నిర్ణయించుకుని ఉపయోగించాలి.
ఓపెన్‌సోర్స్‌ అపోహలు-సమాధానాలు
1. ఐటీ రంగంలో ఓపెన్‌ సోర్స్‌కు స్థానం లేదు. అది ఒక నాటి మాట. నేడు ఓపెన్‌ సోర్స్‌ సాప్ట్‌వేర్‌లైనా లినక్స్‌, అపాచి జావా వంటి వాటినే ఐటీ రంగం విస్తృతంగా వాడుతోంది.
2. మిషన్‌ ‘క్రిటికల్‌’ ఆప్లికేషన్లకు ఓపెన్స్‌ సోర్స్‌ పనికి రాదు. వాణిజ్యపరమైన సాప్ట్‌వేర్‌ సంస్థలు తమ భుక్తి కోసం అనే మాటలివి. నేడు ఎన్నో కీలకమైన (మిషన్‌ క్రిటికల్‌) పెద్దపెద్ద ప్రాజెక్టులలో ఓపెన్‌సోర్స్‌ విస్తృతంగా వాడుతున్నారు. ఓపెన్‌సోర్స్‌ వాడకం వల్ల యూజర్లతో ప్రతీ అంచెలోనూ సంపద్రించి వారి అవసరాలకు, సౌకర్యాలకు అనుగుణంగా మార్పులు చేయడం సాధ్యం.
3. ఓపెన్‌ సోర్స్‌ సంస్థలకు స్వతహాగా వారి మేధోవాక్కులు ఉండవు. ఇదీ అపోహే. క్లోజ్డ్‌ ఎండ్‌ (ప్రొప్రయిటర్‌) సాప్ట్‌వేర్‌ సంస్థలకు ఏ ఏ కాపీ రైట్ హక్కులుంటాయో అవన్నీ ఓపెన్‌ సోర్స్‌ సంస్థలకూ ఉంటాయి. వ్యాపార వాణిజ్య ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్‌లా ఓపెన్‌సోర్స్‌ నియంత్రత్వదోరణీని అవలంభించదు.
4. ఓపెన్‌ సోర్స్‌ పరిజ్ఞానం – ప్రొఫెషనల్‌ స్థాయి సపోర్టు నివ్వదు. ఇదీ అపోహే. నేడు ఓపెన్‌ సోర్స్‌లో ఇస్తున్నంత చక్కని డాక్యుమెంటేషన్‌, ప్రొఫెషనల్‌ సపోర్టు మరి ఏ ప్రొప్రయిటరీ సాప్ట్‌వేర్‌ సంస్థ కూడా ఇవ్వలేదు.
5. ఓపెన్‌సోర్స్‌లో నియంత్రణ లేదు కోడ్‌ ఎవరైనా మార్చుకోవచ్చు. ఈ రకం అపోహలను కొందరూ వ్యతిరేక ధోరణి కలిగిన వారు ప్రచారం చేస్తుంటారు. ఎవరంటే వారు ఎలాగంటే అలా కోడ్‌ మార్చడం జరగదు. ఎలాంటి కోడ్‌ మార్పులు జరిగినా అవి కేవలం సాఫ్ట్‌వేర్‌ లో ‘బగ్‌’ తొలగింపుకు సంబంధించి మాత్రమే ఉంటుంది.
6. ఓపెన్‌ సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌ సురక్షితం కాదు. చాలా మందిలో ఈ అపోహ ఉంది. ఎందుకంటే ఎటువంటి ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ అయినా అందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా హాకర్లు వీటిని హేకింగ్‌ చేస్తారనేది అపోహ. ఓపెన్‌ సోర్స్‌ ప్రమాణాలు ఉన్నతమైనవి, సురక్షితమైనవి (కోడ్‌తో సహా). నిజానికి ఓపెన్‌ సోర్స్‌లో దొరికే సాప్ట్‌వేర్‌లలో ఎన్నో మాణిక్యాలున్నాయి.

About Technology For You

Technology For You (TFY) is a Leading Technology & Career Magazine. In addition to the Print Edition, we have been bringing out Web Edition also with Daily News & Updates. This is one of the Largest Circulated magazine in South India, and also reaching across India.
View all posts by Technology For You →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *